కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం
దర్శకత్వంతెలంగాణ రాష్ట్రం, జయశంకర్ జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం, దట్టమైన అడవి మధ్యలో, చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన, పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది.
ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణకాశీగా ప్రసిద్ధిచెంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు తరలివస్తారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరంలో ఒకే పానవట్టంపై లింగాకృతిలో యముడు, శివుడు కలిసి ఉండడం విశేషం. కాలుడు, ఈశ్వరుడు కొలువై ఉండడంతో కాళేశ్వరంగా పేరు వచ్చిందని చెబుతారు. భక్తులు ముందుగా యమ లింగాన్ని, వెంటనే శివ లింగాన్ని అభిషేకిస్తూ, స్పర్శ దర్శనం చేసుకుంటే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని అనాది నుంచి నమ్ముతున్నారు. యమలోకంలో పాపాత్ములు తగ్గి ఉక్కు స్తంభం చల్లారిపోయి ఆయుధాలు తుప్పు పడుతుండడంతో శివుని అనుగ్రహం పొందేందుకు యముడు తపస్సు చేశారని స్కంధ పురాణాలు చెబుతున్నాయి. ఆయన తపస్సుకు మెచ్చి కాళేశ్వర క్షేత్రంలో శివుడి పక్కనే లింగాకారంగా వెలుస్తావని యముడు వరం పొందాడని చరిత్ర చెబుతోంది.
త్రివేణి సంగమం
గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కాళేశ్వరంలో సంగమిస్తాయి. ఎందరో మునులు త్రివేణి సంగమాన ప్రాణాయామం, ధ్యానం, సంధ్యా వందనంతో తపస్సు చేసే శక్తిని పెంపొందించుకునే వారని స్కంధ పురాణం చెబుతోంది. పూర్వం కాకతీయుల గురువులు, ఆరాధ్యులు ఉండేవారని చరిత్ర చెబుతోంది. కాకతీయ రాజులు విజయాలు పొందినప్పుడు ప్రథమంగా కాళేశ్వర క్షేత్రాన్ని దర్శించుకునే వారని శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. నదులకు పన్నెండేళ్లకోసారి పుష్కరాలు వస్తాయి. అయితే కాళేశ్వరంలోని త్రివేణి సంగమానికి మాత్రం మూడు పుష్కరాలు వస్తుంటాయి. 2015లో గోదావరి పుష్కరాలు జరుగగా తిరిగి 2027లో, 2010లో ప్రాణహిత పుష్కరాలు నిర్వహించగా 2022లో పుష్కరాలు వస్తాయి, సరస్వతి నదికి 2013లో పుష్కరం రాగా 2025లో తిరిగి వస్తాయి.
స్థల పురాణం – విశిష్టత
గర్భగుడిలో రెండు శివలింగాలు ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వరస్వామి ముక్తిని ఇస్తుండడంతో యముడికి పనిలేకుండా పోయిందట. అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా, యమున్ని కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమన్నాడట. ముక్తేశ్వరున్ని చూచి యమున్ని దర్శించకుండా వెళితే మోక్షప్రాప్తి దొరకదని వాళ్ళని నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట. అందుకే భక్తులు స్వామిని దర్శించుకొని, కాళేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు.
ముక్తేశ్వరస్వామి లింగంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. లింగంలో రెండు రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడికి సమీపంలో ఉన్న గోదావరి, ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తుందని భక్తుల నమ్మకం.
ఎలా చేరుకోవాలి?:
గాలి ద్వారా
వాయు మార్గంలో హైదరాబాద్‌కు వెళ్లి కారు, రైలు లేదా బస్సులో ప్రయాణించండి. ప్రత్యామ్నాయంగా, నాగ్‌పూర్‌కు వాయు మార్గంలో , ఆపై కారును కాళేశ్వరానికి తీసుకెళ్లండి. కాళేశ్వరం 214 కిలోమీటర్ల దూరంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హెచ్‌వైడి), హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. కాళేశ్వరం 275 కిలోమీటర్ల దూరంలో సోనెగావ్ విమానాశ్రయం (ఎన్ ఎ జి), నాగ్‌పూర్, మహారాష్ట్ర
రైలులో
కాళేశ్వరంలో రైల్వే స్టేషన్ లేదుకనుక సమీప రైల్వే స్టేషనైన రామగుండం (98 కిలోమీటర్లు)లో దిగి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి కాళేశ్వరం చేరుకోవచ్చు. రాముగుండం నుండి కాళేశ్వరానికి అధిక సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉంటాయి. వరంగల్ మరియు కాజీపేట్ రైల్వే స్టేషన్ లు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
రోడ్డు ద్వారా
తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నుండి కాళేశ్వరంకి నేరుగా బస్సులను నడుపుతుంది. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లేదా జూబ్లీ బస్టాండ్ నుండి ఈ బస్సులు ప్రతి రోజు అందుబాటులో ఉంటాయి. ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ సర్వీసులను ఆర్టీసీ నడుపుతుంది. ప్రయాణ సమయం 4 - 5 గంటలు పట్టవచ్చు. కారు మార్గం లేదా బైక్ మార్గం: హైదరాబాద్ - సిద్దిపేట - పెద్దపల్లి - కాళేశ్వరం ( 300 కిలోమీటర్లు, 5 గంటల సమయం), హైదరాబాద్ - బొంగిర్ - వరంగల్ - పర్కాల్ - కాళేశ్వరం ( 260 కిలోమీటర్లు, 4 గంటల 15 నిమిషాలు)